వైఎస్‌ఆర్ జిల్లా, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో చోటుచేసుకున్న చోరీలు, మహిళా వసతిగృహాల్లో ఆగంతకుల చొరబాటు వంటి ఆగడాలకు చెక్ పెట్టేలా విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో ప్రిన్సిపాల్ చాంబర్‌గా వినియోగించిన గదిని పోలీసు అవుట్ పోస్టు కేంద్రానికి కేటాయిస్తూ విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ప్రతి విశ్వవిద్యాలయంలో పోలీసుస్టేషన్ లేదా కనీసం పోలీసు అవుట్ పోస్టు అయినా ఉంటుంది. అయితే వైవీయూ ఏర్పాటై 14 ఏళ్లు కావస్తున్నా కనీసం పోలీసు అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ ముందు కు సాగ లేదు. అయితే మునగాల సూర్యకళావతి వైవీయూ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టు ఆవశ్యకతను గుర్తించి ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్‌తో చర్చించారు. దీంతో జిల్లా ఎస్పీ వైవీయూలో పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలపడంతో పాటు వైవీయూలో ప్రధానద్వారంకు సమీపంలో ఓ గదిని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సమ్మతించిన వైవీయూ అధికారులు విధులు నిర్వహించే పోలీసుల కోసం అన్ని వసతులు ఉండే ఒక గదిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరి కొద్దిరోజుల్లోనే వైవీయూలో అవుట్‌పోస్టు ఏర్పాటు కానుంది.
వేమనకు ‘రక్షణ’గా!